ప్రతాపరుద్రుడి నిర్యాణం - నిజానిజాలు (మన చరిత్ర - 8) - Nagesh Beereddy

Thursday, July 27, 2017

ప్రతాపరుద్రుడి నిర్యాణం - నిజానిజాలు (మన చరిత్ర - 8)

వీరనారి కాకతీయ సామ్రాజ్ఞి రాణి రుద్రమదేవి ఎలా మరణించింది? ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నవి జనబాహుళ్యంలో ఉన్న కథలే కానీ.. అందుకు తగిన చారిత్రక ఆధారాలు లేవు. ఆమె మరణకాలాన్ని తెలియజేస్తూ నల్లగొండలోని చందుపట్లలో ఒక శాసనం వెలుగులోకి వచ్చింది. కానీ ఎలా మరణించిందో ఆ శాసనం ద్వారా తెలియలేదు. అలాగే, ప్రతాపరుద్రుని మరణం కూడా రణరంగంలో వెలుగుచూడని ఒక రహస్యమే.

ప్రతాపరుద్రుడు ఉలుఘ్‌ఖాన్‌కు లొంగిపోయినప్పుడు మహోజ్వలంగా వెలిగిపోయిన ఓరుగల్లు నగరం కారు చీకట్లలో మునిగిపోయింది. ప్రతాపరుద్రుడిని ఎక్కువ రోజులు ఓరుగల్లులోనే ఉంచితే, అతని మీద అభిమానంతో ప్రజలు తిరుగుబాటు చేయవచ్చని, ఇంకా ఇతర క్లిష్ట పరిస్థితులూ తలెత్తవచ్చని భావించిన ఉలుఘ్‌ఖాన్ వెంటనే ప్రతాపరుద్రున్ని, అతని కుటుంబాన్ని ఢిల్లీకి పంపాడు. తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఖాదిర్ ఖాన్, ఖ్వాజాహాజీలకు ఆ బాధ్యత అప్పగించాడు. అయితే ప్రతాపరుద్రుడు మార్గమధ్యంలోనే కన్నుమూశాడు. ఈ విషయాన్నంతా గ్రంథస్థం చేసిన షాంసి సిరాజ్ అఫీఫ్ ప్రతాపరుద్రుడు ఎలా మరణించాడో మాత్రం వివరించలేదు.ప్రతాపరుద్రుని మరణానికి సంబంధించిన మరికొంత సమాచారం శాసనాల ద్వారా లభ్యమవుతున్నది. సుల్తాను సైన్యం ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి తీసుకెళుతుంటే దారిలో సోమోద్భవ (నర్మదా) నదీ తీరంలో ఆయన కన్నుమూశాడని ముసునూరి ప్రోలయ నాయకుడి (సుమారు క్రీ.శ. 1330) విలసతామ్ర శాసనం చెబుతున్నది.
ప్రతాపరుద్రుడు సహజంగా మరణించలేదని, స్వచ్ఛందంగానే భగవదైక్యం చెందాడని క్రీ.శ. 1423లో రెడ్డిరాణి అనితల్లి వేయించిన కలువచేరు తామ్ర శాసనంలో తస్మిన్ ప్రతాపరుద్రే స్వస్థానం స్వేచ్ఛయైన యాతవతి అని ఉంది. దీనిని బట్టి ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకోవడమో లేదా అతని కోరిక మేరకు సహచరులెవరైనా చంపడమో జరిగి ఉంటుంది అని పి.వి. పరబ్రహ్మశాస్త్రి అంటారు. ప్రతాపరుద్రుడు స్వాభిమాని అయిన రాజు, తన నిర్బంధ జీవితంలోని మార్పులకు, అతను రాజీ పడలేకపోయాడనిపిస్తుంది. అవమానం కంటే మృత్యువే మేలని భావించి స్వచ్ఛంద మరణాన్ని ఆహ్వానించి ఉండవచ్చని శాస్త్రి భావించారు.
ఇప్పటి వరకు కాకతీయుల చరిత్రకు ప్రధాన ఆధారంగా చెప్పుకుంటున్న ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము అతని మరణం గురించి ఏం చెబుతున్నదంటే.. ప్రతాపరుద్రుడు.. భార్యయగు విశాలాక్షియు స్వర్గస్థులగుట.. గోదావరి యందు స్నానమాచరించి దివ్యాంబరంబులు ధరించి నానా భూషణములు దాల్చి విభూతి రుద్రాక్ష మాలికాలంకృతుండై గోదావరి గర్భంబున గూర్చుండి, శంభులింగంబును తన హృదయంబున నిల్పి ధ్యానించెను. అనంతరం రాజు తన పట్టపు దేవియగు విశాలాక్షిని జూడగనే శివదేవయ్య విశాలాక్షి కిట్లనియె తల్లీ! నీవు నన్ను జాలకాలంబు పూజించితివి. నీ కిష్టంబైన వరంబిచ్చెద వేడుము అనెను. ఆయమ్మ యాతనికి నమస్కరించి మహాత్మా! తనకు బతిజీవంబు వెంటనే తన జీవంబును జనునట్లు వరంబు దయచేయమనెను. ఆయయ్య యట్లనే యొసంగెను. - అంటే ప్రతాపరుద్రుని నిర్యాణము పవిత్ర గోదావరి నదిలో జరిగిందని తెలుస్తున్నది.
ప్రతాపరుద్ర నిర్యాణం గౌతమీ గంగాగర్బం (నేటి కాళేశ్వరం)లోనే జరిగినట్లు సిద్ధేశ్వర చరిత్ర కూడా చెబుతున్నది. పూర్వాఖ్యానాలను బట్టి ప్రతాపరుద్రుడు బందీ నుండి విడివడి కాళేశ్వర క్షేత్రంలో కొంత కాలం నివసించాడనే భావన స్థానిక ప్రజల్లోనూ వ్యాపించి ఉన్నది. రేచర్ల పెదసింగమ నాయునికి బందీ విమోచక అనే బిరుదు ఉండడం వల్ల పద్మనాయక వీరులు ప్రతారుద్రుడిని సుల్తానుల నుండి విడిపించారనే భావం పూర్వ చారిత్రకుల్లో ఉన్నది. వీటన్నింటిని బట్టి చూస్తే ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో కాకుండా కొంతకాలం గోదావరి తీరంలో కాళేశ్వరం సమీపంలో ఉన్నాడనే అనుమానమూ కలుగక మానదు.
ఏది ఏమైనా ప్రతాపరుద్రుడు ఎలా మరణించాడన్నది ప్రస్తుతానికి వెలుగుచూడని రహస్యంగా పక్కన పెడితే.. ప్రతాపరుద్రుని లొంగుబాటు, మరణంతో కాకతీయ రాజుల పాలన మాత్రం అంతమైంది. ఓరుగల్లు ఢిల్లీ సుల్తానుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 
ఆత్మార్పణతో అమరుడైన ప్రతాపరుద్రుడు తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచాడు. తాను, సుల్తాన్ ముందు తలవంచితే అంతకు మించిన అవమానం మరొకటి లేదనుకున్నాడు. అవమానంతో బతికి ఉండడం కంటే మృత్యువే మేలనుకున్నాడు. 
సుల్తానుకు దాసోహమని అతడికి ప్రతాపరుద్రుడు సామంతుడిగా మారి బతికిపోవచ్చు. దేవగిరి యాదవరాజు రామచంద్రుని దారిలో నడిచి ప్రాణాలు దక్కించుకునే అవకాశం ఉన్నప్పటికీ ఆ దుస్థితి తనకు వద్దనుకున్నాడు ప్రతాపరుద్రుడు. 
మొత్తానికి మహాయోధుడు, దక్షిణ భారతాన్ని ఏలుతున్న చక్రవర్తి అయిన ప్రతాపరుద్రుడు తన ముందు తల వంచితే గర్వంగా మీసం తిప్పుదామనుకున్న ఉలుఘ్‌ఖాన్, ఘియాసుద్దీన్ తుగ్లక్‌ల కల మాత్రం నెరవేరలేదు. 
ఇదంతా అవలీలగా జరిగినట్లు ముస్లిం చరిత్రకారులు రాశారు. కాకతీయుల పతనాన్ని, ప్రతాపరుద్రుని ఆత్మార్పణాన్ని ఒక్క ముక్కలోనే తేల్చేశారు. ప్రతాపుడిని పటిష్టమైన సైన్యంతో ఢిల్లీకి తరలించాడని షాంసీ సిరాజ్ అఫీఫ్ గ్రంథస్థం చేశాడు. కానీ ఆయన మరణాన్ని సమగ్రంగా పేర్కొనలేదు. 
సుల్తానును ఎదిరించిన యాదవ రాజు హరగోపాలుని తోలు ఒలిచి తల నరికి కోట గుమ్మానికి వేలాడదీసినట్లు గొప్పగా రాసుకున్నారు వారు. ఒక్కసారి తిరుగుబాటు చేసిన హరగోపాలుడిని వధించడాన్నే అంత గొప్పగా రాసుకున్న వారు, సుమారు ఇరవై రెండేండ్లు ఏకధాటిగా తురుష్కులను ఎదిరించిన మహాయోధుడైన ప్రతాపరుద్రుని మరణాన్ని మాత్రం అంత తేలికగా ఎందుకు తీసుకుంటారు? 
రుద్రమదేవిని దొంగదెబ్బ తీసిన అంబదేవుడి మాదిరిగానే.. సుల్తానులు, అతని ఆస్థాన రచయితలు.. ప్రతాపరుద్రుడిలాంటి మహాయోధుడు తమ బందీ నుంచి తప్పించుకున్నాడంటే.. తమకు అప్రతిష్టగానే భావించి ఉండవచ్చు. అందుకే అతని మరణాన్ని గురించి గ్రంథస్థం చేయకుండా రహస్యంగా ఉంచారేమో!

No comments: