కాకతీయుల దగ్గర పరుసవేది ఉండేదా? (మన చరిత్ర - 10) - Nagesh Beereddy

Monday, November 6, 2017

కాకతీయుల దగ్గర పరుసవేది ఉండేదా? (మన చరిత్ర - 10)

ప్రతాపరుద్రుని మరణంఒక రహస్యమే. నర్మదా నదీ తీరంలో ఆయన కన్నుమూశాడని ముసునూరి ప్రోలయ నాయకుని శాసనం చెబుతుంటే.. పవిత్ర గోదావరి నదిలో మరణించాడని ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము చెబుతున్నది. ప్రతాపరుద్ర నిర్యాణం గౌతమీ గంగాగర్బం (నేటి కాళేశ్వరం)లోనే జరిగినట్లు సిద్ధేశ్వర చరిత్ర కూడా చెబుతున్నది. ఇంతకీ ఏది నిజం? స్థానికంగా జనబాహుళ్యంలో ఉన్న ఒక కథ ప్రతాపరుద్రుని మరణం గురించి ఇలా చెబుతున్నది. ఈ కథ పరుసవేది లింగంతో ముడి పడి ఉన్నది. 

ఇదీ ఆ కథ ...

కరీంనగర్ జిల్లా గోదావరి నదీ తీరంలోని కాళేశ్వర పుణ్యక్షేత్రం.. దానికి సమీపంలో మహదేవ్‌పూర్ వద్ద ప్రతాపగిరి.. తరతరాలుగా కాకతీయ సామ్రాజ్యంలో కాపాడుకుంటూ వస్తున్న ఓ మహిమగల శంభులింగం (పరుసవేది లేదా స్పర్శవేది) తురుష్కుల చేతికి చిక్కకూడదన్న నిశ్చయంతో ప్రతాపరుద్రుడు ఓరుగల్లు నుంచి ప్రతాపగిరికి వచ్చాడు. శత్రువుకు తలవంచని ప్రతాపరుద్రునిపై రగిలిపోతున్న తురుష్కులు.. కాకతీయ సామంతుల మధ్యే వర్గస్పర్ధలు తెచ్చి.. ఆశ చూపి ప్రతాపరుద్రుని ఆచూకీ తెలుసుకొని ప్రతాపగిరిని చుట్టుముట్టారు. దీన్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు ఇక తప్పించుకోవడం కుదరదని, లొంగుబాటు తప్పదని తెలుసుకొన్నాడు. మహిమగల శంభులింగం శత్రువుల చేతికి చిక్కకూడదని.. తప్పనిసరి పరిస్థితుల్లో పరుసవేదితోపాటు గోదావరి నదీలో దూకాడన్నది కథనం. ఇది స్థానికంగా జనశృతిలో ఉన్న కథ మాత్రమే. కానీ చరిత్రలో ఎక్కడా నమోదైనట్టు లేదు. అయితే, ఈ కథలో ఉన్న పరుసవేది గురించి మాత్రం లిఖితపూర్వకంగా ఉంది. కాకతీయ రాజుల చరిత్రకు ప్రధానమైన ఆధారాలు ఏకామ్రనాతుని ప్రతాపరుద్ర చరిత్రము, కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రము. ఈ రెండు గ్రంథాలు 15, 16 శతాబ్దాలలో లిఖించినవి. అంటే అప్పటికి కాకతీయ సామ్రాజ్యం పతనమై దాదాపు 150 సంవత్సరాలు అయినప్పటికీ, దాని ప్రాభవ సౌరభాలు పూర్తిగా అంతరించిపోలేదు. ఆనాటికి ప్రత్యక్షంగా ఉన్నవి, జనశ్రుతిలో విన్నవి అయిన కథలను, విశేషాలను ఆ రెండు గ్రంథాలు ఎంతో హృద్యంగా ఆవిష్కరించాయి. 
ఈ గ్రంథాలలో కొన్ని అసంబద్ధ విషయాలు కనిపిస్తున్నప్పటికీ, వాటిని వదిలివేస్తే అవి ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తూ, చరిత్ర నిర్మాణానికి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవేకాక కాకతీయుల కాలంలో వచ్చిన దేశీయ, విదేశీయ పర్యాటకులు మార్కోపోలో, ఇబన్ బటూటా, జియావుద్దీన్ బరానీ, అమీర్ ఖుస్రో, ఇసామీ మొదలైన పర్యాటకుల రచనలు కూడా ఎంతో విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర, కాసె సర్వప్ప సిద్ధేశ్వర చరిత్రల ఆధారంగా కింది విషయాలు తెలుస్తున్నాయి. రెండవ ప్రోలరాజు అనుమకొండ రాజధానిగా కాకతిపురాన్ని పాలిస్తున్న రోజులవి. నగర ప్రజల కోసం ఒక బండిమీద ధాన్యం తెస్తూ ఉండగా హనుమకొండకు ఆగ్నేయ భాగంలో.. రెండు కోసుల (సుమారు నాలుగు మైళ్లు) దూరంలో ఒక రాయికి తగిలి బండి ఆగిపోయింది. ఆ బండిని తీసుకొస్తున్న రక్షకభటులు ఎంత ప్రయత్నించినా బయటకు రాలేదు. దీంతో రాత్రి అక్కడే బండికి కాపలాగా ఉన్నారు. తెల్లారాక చూస్తే బండి చక్రానికి ఉన్న ఇనుపకమ్మి బంగారంగా మారిపోయి, తళతళా మెరవసాగింది. అది చూసి ఆశ్చర్యపడిన రక్షకభటులు, హనుమకొండకు వెళ్లి ఈ విషయాన్ని ప్రోలరాజుకు తెలియజేశారు. వెంటనే ప్రోలరాజు సపరివారంగా అక్కడికి చేరుకుని ఆ ప్రదేశంలో తవ్వించాడు. అక్కడ దేదీప్యమానంగా శరత్కాలచంద్రుని కాంతితో జ్యోతిర్మయంగా వెలిగిపోతున్న ఒక పరుసవేది లింగ రూపశిల (ఒరగల్లు) బయటపడింది. ఒరగల్లు బయల్పడిన చోటు కనుక ఆ ప్రదేశానికి ఓరుగల్లు అని నామకరం చేశారట (సిద్ధేశ్వర చరిత్ర పు. 95). ఏకామ్రనాథుడు తన ప్రతాపచరిత్ర (పుట 23)లో పరుసవేది లింగం విషయంలో కాళేశ్వరం నుంచి శ్రీ రామరణ్య పాదులను, మహేంద్ర శ్రీపాదులను, హిడింబాశ్రమ (నేటి మెట్టుగుట్ట) నివాసులైన త్రిదండి రుషులను పిలిపించి వారిని సంప్రదించాడని పేర్కొన్నాడు.

వీటన్నింటినీ సమన్వయించి పరిశీలిస్తే.. కాకతీయుల కాలంలో నిర్మితమైన వందల శివాలయాలలోని ఏ శివలింగమూ స్వయంభూ అని వారు పేర్కొనలేదు. ఈ ఒక్క పరుసవేది లింగాన్నే భగవాన్ శ్రీ స్వయంభూ అని మల్కాపూర్ శాసనం, శ్రీ స్వయంభూనాథ దేవర అని ఖుష్‌మహల్ శాసనం పేర్కొన్నాయి. ఈ శాసనాలలో, సాహిత్యంలో ఇలా నమోదు కావడం విశేషం. పరుసవేది శిలలు స్వయంగా తయారయ్యేవి కానీ, మానవ నిర్మితాలు కావు. కనుక ఒరగల్లు అనే పరుసవేది శిలకథ వాస్తవమేనని, దాని వల్లనే నగరానికి ఓరుగల్లు అనే పేరు వచ్చిందని ఒప్పుకోవడం తప్పుకాదు అంటారు శాసనాల ఆధారంగా ఓరుగల్లు అసలు చరిత్ర రాసిన ఆచార్య హరి శివకుమార్. ప్రకృతి శక్తులు ఉంటాయని కాకతీయుల కాలంలో బాగా నమ్మేవారనడానికి కొన్ని నిదర్శనాలూ ఉన్నాయి. ఆ కాలానికే చెందిన పాల్కురికి సోమనాథుని రచనల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. చనిపోయిన వారిని బతికించడం.. వంగకాయలను లింగ కాయలుగా మార్చడం వంటి మహిమల గురించి కూడా సోమనాథుని రచనల్లో ఉంది. ఇంతేకాదు, గడియ గడియకూ ఒక పుష్పాన్ని కిందికి విడిచే చెట్లు, మధ్యకు నరికి వేసినా వెంటనే మళ్లీ పెరిగే చెట్లు శ్రీశైల పర్వత ప్రాంతాల్లో ఉండేవని పండితారాధ్య చరిత్రలో సోమనాథుడు పేర్కొన్నాడు.

మనకు తెలియని ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ నమ్మదగినవి కావా? అంటే, నమ్మొచ్చు.. నమ్మకపోవచ్చు. ఎవరి ఇష్టం వారిది. కానీ, ఓరుగల్లుకు ఆ పేరు రావడానికి శ్రీ స్వయంభూ దేవాలయం స్థానంలో లభించిన స్పర్శవేది స్వయంభూ శంభులింగ శిలయే అని క్రీ.శ. 1264 నాటి చింతలూరి తామ్ర శాసనం కూడా ధ్రువీకరిస్తున్నది. ఈ స్పర్శవేది శిల కాకతీయ సామ్రాజ్య వైభవానికి చింతామణి (కోరికలు తీర్చేది) వంటిదని చిత్తాపుఖాన్ శాసనం పేర్కొన్నది. అయితే, ఈ పరుసవేది లింగం ప్రతాపరుద్రుని చివరి రోజుల వరకూ కూడా లోహాన్ని బంగారంగా మారుస్తూ వచ్చిందట. మహిమగల ఈ పరుసవేది లింగాన్ని అపహరించడానికి ప్రతాపరుద్రుని కాలంలోనే కొందరు దుష్టులు ప్రయత్నించారనీ ప్రతీతి. అప్పుడు ప్రతాపరుద్రుడు దేవీ వరప్రసాదమైన ఖడ్గఖేటకములను ధరించి ఆ స్వయంభూ లింగాన్ని రక్షించాడట. అయితే, ఇంతటి ప్రశస్థమైన చారిత్రక నేపథ్యం కలిగి, ఓరుగల్లు అని పేరు రావడానికి కారణమైన పరుసవేది స్వయంభూ లింగం విషయాన్ని చరిత్రకారులు నమ్మినట్లుగా కనిపించదు. కారణం, ఆ మేరకు సరైన కనీస ఆధారాలైనా లభ్యం కాకపోవడమే. కాగా, ఈ అద్భుత లింగ వృత్తాంతాన్ని కేవలం ఒక పుక్కిటి పురాణంగా తోసి వేశారేమో.

1 comment:

ananya media4321 said...

http://telanganasamacharam.online/english/single/47