కాకతీయుల గురించి మనకు తెలిసిందెంత? (మన చరిత్ర - 11) - Nagesh Beereddy

Tuesday, November 7, 2017

కాకతీయుల గురించి మనకు తెలిసిందెంత? (మన చరిత్ర - 11)

ఈ అనంత కాలగమనంలో మహా సామ్రాజ్యాల ప్రస్థానంలో చరిత్ర పొరల్ని తవ్వుకుంటూ పోతుంటే.. యుద్ధాలు.. జయజయ ధ్వానాలు.. జయకేతనాలు.. జయ స్తంభాలు.. తోరణాలు.. పతనాలు.. రక్తపాతాలు.. సమాధులు.. శిథిలాలు.. శాసనాలు.. మొత్తంగా శతాబ్దాల నిశ్శబ్దం. ఆ తరతరాల నిశీధి గురించి ఈ తరానికి తెలియజెప్పేందుకు చిరు వేకువజాడగా ఏదో ఒక శిథిలం బయటపడుతుంది. ఓ శాసనం వెలుగులోకి వస్తుంది. ఆ శాసనాలే చరిత్ర రచనకు ముఖ్య ఆధారాలు. వీటి ఆధారంగా.. సుదీర్ఘ కాలంపాటు వెలుగొందిన మహోన్నత కాకతీయ సామ్రాజ్యం గురించి ఇప్పటి వరకు మనకు
తెలిసింది ఎంత? 


అప్రతిహత విక్రమ చక్రవర్తులై, చలమర్తిగండ బిరుదాంకితులై దాయగజ కేసరులై కాకతీయ వంశమండనులై త్రిలింగదేశాధీశులై యావదాంధ్ర దేశాన్ని అవిచ్ఛిన్నంగా పరిపాలించి తెలుగుజాతి చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించి, తెలుగు వారి రాజకీయ సాంస్కృతిక జీవన చైతన్యానికి నిత్యదీప్త ప్రతీకలుగా నిలిచిన అచ్చ తెలుగు చక్రవర్తులైన కాకతీయుల గురించి మనకు తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. ఖగోళశాస్త్రం మొదలు కామశాస్త్రం వరకూ అన్ని శాస్త్ర, సాహిత్య ప్రక్రియలలో మౌలికం, ప్రామాణికం అయిన రచనలు చేసిన ప్రాచీన భారతీయులు.. శాస్త్ర నిబద్ధమైన, ప్రామాణికమైన చరిత్ర రచన మాత్రం చేయలేకపోయారు అంటారు ఇప్పటి మన చరిత్రకారులు కొందరు. నిజమే! కాకతీయుల అసలు చరిత్ర కోసం అన్వేషిస్తున్నప్పుడు ఇది పూర్తిగా వాస్తవమేనని అనిపిస్తుంటుంది. క్రీ.శ. 1206 తర్వాత భారతదేశంలో ముస్లిం రాజుల అధికారం స్థిరమయ్యాక వారి గురించి అరబిక్, పర్షియన్ భాషల్లో చారిత్రక వృత్తాంతాలను ముస్లిం చర్రితకారులు నమోదు చేశారు. వారి రచనల్లో తమ సుల్తానుల గురించి కాస్త అతిశయంగా రాసినప్పటికీ, అభూత కల్పనలకు, అద్భుత వృత్తాంతాలకు తావీయలేదు. కానీ, హైందవ రాజులకు సంబంధించి కొన్ని విషయాలను చరిత్రలో నమోదు చేయకుండా వారు రహస్యంగా ఉంచారని మాత్రం అర్థమవుతున్నది. 
హిందూ రాజులకు సంబంధించి కల్హణుని రాజతరంగిణి తర్వాత చరిత్ర అని అన్ని విధాలుగా చెప్పకోదగ్గ గ్రంథాలు సంస్కృత భాషలోగానీ, మరే ఇతర భాషల్లోగానీ రాలేదు. అలాంటి ఒక చరిత్ర రచనా ప్రయత్నాన్ని తెలుగుభాషలో తొలిసారిగా చేసిన ప్రథమాంధ్ర చరిత్రకారుడు ఏకామ్రనాథుడు. అతడు రచించిన ప్రతాపరుద్ర చరిత్రము నుంచే మనకు తొలి తెలంగాణ చక్రవర్తులు, మన జాతి వెలుగులు అయిన కాకతీయుల గురించి తెలుస్తున్నది. ఏకామ్రనాథుడు తన చరిత్ర రచనకు ఆధారంగా పేర్కొన్న కథలు, నాటికి కాకతీయ రాజులను గురించి జనబాహుళ్యంలో ఉన్న జనశ్రుతులు. ఒక చారిత్రక సత్యం కొంతకాలం తర్వాత అది జనశ్రుతిగా మారుతుంది. స్థానిక వృత్తాంతంగా అది మారడంతో, ఆ చారిత్రక సత్యం చుట్టూ లేదా ఓ చారిత్రక వ్యక్తి చుట్టూ అనేక అద్భుత వృత్తాంతాలు, అభూత కల్పనలు పేరుకుంటాయి. చారిత్రక పురుషులు జనశ్రుతిలో పురాణ పురుషులుగానూ మారిపోతారు. ఇది చరిత్ర గతిలో నిత్యం జరిగే విషయమే. ఈ దృష్టితోనూ చూసినప్పుడు ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రములో అభూత కల్పనలు, అద్భుత వృత్తాంతాలు చాలా తక్కువగానే ఉన్నాయి. శాసనాల ఆధారంగా నమ్మదగిని చారిత్రక విషయాలే ఎక్కువగా ఉన్నాయి. చారిత్రక విషయాలలో కొన్ని కాలవ్యతిరిక్తాలు, అసంబద్ధ విషయాలు, అద్భుత వృత్తాంతాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత బయటపడిన శాసనాలతో అసలు చరిత్రను సమన్వయ పరచడంలోనే నేటి చరిత్ర పరిశోధకులు తమ పాటవాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది అంటారు సి.వి. రామచంద్రరావు. 1984లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ముద్రించిన ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రము కోసం సి.వి. రామచంద్రరావు సంపాదకునిగా రాసిన పీఠికలో పై విషయం పేర్కొన్నారు. 
అవును.. కాకతీయుల కాలానికి చెందిన రాజకీయ, సాంఘిక చరిత్రను గురించి సమాచారం చాలావరకు శాసనాల వల్లే లభ్యమైంది. కాకతీయుల గురించి మనకు సాహిత్యం, వారి కాలం నాటి కట్టడాల ద్వారా కొంత తెలిసినప్పటికీ మరింత లోతైన, అసలు చరిత్రను తెలుసుకునేందుకు మాత్రం వాటిని శాసనాలతో సమన్వయ పరచడం అనేదే కీలకంగా నిలిచింది.1882లో జె.ఎస్. ఫ్లీట్ కాకతీయ రుద్రదేవుడి అనుమకొండ శాసనం తొలిసారి వెలుగులోకి తేవడంతో కాకతీయుల ఉజ్వల కాలపు చరిత్ర గురించిన శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఎంతోమంది పండితులు కాకతీయ చరిత్ర పరిశోధనలో మరింత కృషి చేశారు. 1964లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పురాతత్త శాఖలో శాసనాల అన్వేషణ కోసం ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పరచింది. ఈ మేరకు జరిగిన అన్వేషణల్లో ఎన్నో కొత్త శాసనాలు వెలుగుచూశాయి.
కాకతీయ సామ్రాజ్యానికి కేంద్ర స్థానమైన తెలంగాణలోని వరంగల్లు, కరీంనగర్, నల్లగొండ జిల్లాలలో లభ్యమైన వాటితో కలిపి అవి సుమారుగా వెయ్యి దాకా ఉన్నాయి. వీటిని అధ్యయనం చేయడంలో ప్రముఖ చరిత్రకారులు పి.వి. పరబ్రహ్మ శాస్త్రి కీలక భూమిక పోషించారు. అప్పటి పరిశోధనలలో శాసనాల ఆధారాలను బట్టి ఆయన కాకతీయుల చరిత్రను మూడు భాగాలుగా చెప్పారు. కాకతీయ యుగం ప్రారంభం, సార్వభౌమాధికారం, పరిపాలన తదితర అంశాలు. శాస్త్రి రచించిన పరిశోధనాత్మక గ్రంథం పేరు కాకతీయులు. ప్రస్తుతానికి ఈ గ్రంథం మాత్రమే కాకతీయుల చరిత్రకు సంబంధించిన ప్రామాణిక గ్రంథం.

ఈ గ్రంథ పరిధిని దాటి కొందరు స్థానికేతర రచయితలు తమ సొంత నమ్మకాలతో రకరకాల వక్రీకరణలతో కాకతీయుల చరిత్రను రాస్తున్నారు. ఈ రచనలు చదివి ఇదే నిజమైన చరిత్ర అనుకునే ప్రమాదం ఉన్న నేపథ్యంలో డా॥ అంబటి శ్రీనివాస్ రాజు రాసిన మన కాకతీయులు కూడా సంక్షిప్త ప్రామాణిక చరిత్రగానే కనిపిస్తున్నది. ఇంత చరిత్ర అందుబాటులో ఉన్నా.. కాకతీయుల గురించి మనం తెలుసుకున్నది చాలా తక్కువే. కాకతీయ మూలాలు, రుద్రమదేవి మరణం, ప్రతాపరుద్రుని నిర్యాణం.. ఇలాంటి ఎన్నో విషయాలు వెలుగుచూడని రహస్యాలుగానే ఉన్నాయి. చందుపట్ల శాసనం రుద్రమదేవి మరణాన్ని తెలుపుతున్నది కానీ.. ఎలా మరణించిందో మనకు తెలియదు. ముసునూరి ప్రోలయ నాయకుడి శాసనం, అనితల్లి కలువచేరు శాసనాలు ప్రతాపరుద్రుని నిర్యాణం గురించి చెబుతున్నాయి కానీ, ఎలాగన్నది ఖచ్చితంగా చెప్పడం లేదు. కాకతీయులకు సంబంధించి ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు మరిన్ని శాసనాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు అంతగా లేదనుకుంటున్న సమయంలో.. మేడిమల్‌కల్ శాసనం వెలుగుచూసింది. డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ వెలుగులోకి తెచ్చిన ఈ శాసనం రుద్రమ మరణ సంవత్సరంపై మరింత స్పష్టతను తెచ్చింది. అయినా, కాకతీయుల గురించి వెలుగులోకి రావాల్సిన అంశాలెన్నో ఇంకా ఉన్నాయి. అందుకే, వారి గురించి మనకు తెలిసింది శిల అంత.. తెలియాల్సింది కోటంత.

No comments: